ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా క్రికెట్‌లో రాజకీయాలు.. హనుమ విహారి సంచలన పోస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 07:51 PM

టీమిండియా బ్యాటర్‌, తెలుగు క్రికెటర్‌ గాదె హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రా క్రికెట్‌ జట్టును వీడనున్నట్లు వెల్లడించాడు. రంజీ ట్రోఫీ 2023-2024 క్వార్టర్‌ ఫైనల్‌లో ఓడిపోయి.. టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని.. ఇకపై ఆ జట్టు తరఫున ఆడబోనని పేర్కొన్నాడు. అందుకు గల కారణాన్ని కూడా విహారి తెలిపాడు.


 ఈ మేరకు సోమ‌వారం (ఫిబ్రవరి 26) త‌న‌ సోషల్‌ మీడియా ఖాతాలో విహారి ఓ పోస్ట్ పెట్టాడు. ‘టైటిల్‌ కోసం మేముంతో పోరాడాం. ఆంధ్రా జట్టు త‌ర‌ఫున మ‌రో క్వార్టర్స్ ఓడిపోవ‌డం చాలా బాధ‌గా ఉంది. నేను చేసే ఈ పోస్ట్ ద్వారా కొన్ని వాస్తవాలు మీ ముందు పెడుతున్నా. రంజీ 2023-2024 సీజన్‌లో భాగంగా బెంగాల్‌తో ఆడిన ఫ‌స్ట్ మ్యాచ్‌కు నేనే కెప్టెన్‌గా ఉన్నా. మ్యాచ్ స‌మ‌యంలో నేను 17వ ఆట‌గాడిపై అరిచాను. దీంతో నాపై కోపంతో సదరు ఆటగాడు రాజకీయ నేత అయిన అతడి తండ్రికి నా గురించి ఫిర్యాదు చేశాడు. ఆ రాజకీయ నేత నాపై చ‌ర్యలు తీసుకోవాల‌ని అసోసియేష‌న్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా నా త‌ప్పు ఏం లేకున్నా న‌న్ను కెప్టెన్‌గా వైదొల‌గ‌మ‌న్నారు’ అని హనుమ విహారి పేర్కొన్నాడు.


వాస్తవానికి తాను ఉద్దేశ‌పూర్వకంగా ఎవ‌రినీ ఏమీ అన‌లేదని.. కానీ, అవేమీ పట్టించుకోకుండా అసోసియేష‌న్ మాత్రం తనపై చ‌ర్యలు తీసుకుందని ఆవేద వ్యక్తం చేశాడు హనుమ విహారి. ‘జ‌ట్టు కోసం శక్తినంతా కూడబెట్టుకుని, ఓ పక్క గాయం వేధిస్తున్నా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశా. ఆంధ్రా జట్టును 5 సార్లు నాకౌట్ ద‌శ‌కు తీసుకెళ్లా. టీమిండియా త‌ర‌ఫున 16 టెస్టులు ఆడా. అయినా నా కంటే కూడా అత‌డే వాళ్లకు ముఖ్యమ‌య్యాడు’ అని హనుమ విహారి రాసుకొచ్చాడు.


‘అసోసియేష‌న్ తీరుతో నేనెంతో బాధపడ్డా. నా ఆత్మగౌర‌వం దెబ్బతింది. అప్పుడే నా నిర్ణయం వెల్లడించాల్సింది. కానీ, ఆట‌పై నాకున్న గౌర‌వంతోనే ఈ సీజ‌న్‌ ఆడా. మరో విష‌యం ఏంటంటే.. అసోసియేషన్ ఏది చెప్పినా ఆట‌గాళ్లంతా వినాల‌ని, అసోసియేష‌న్ ఉంది కాబట్టే.. ఆట‌గాళ్లు ఉన్నార‌నే ధోర‌ణి ఇక్కడ ఉంది. ఈ కారణాల దృష్ట్యా నేను ఇక‌పై ఆంధ్రాకు ఆడ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నా’ అని విహారి తన పోస్టులో స్పష్టం చేశాడు.


ఆంధ్రా జట్టు తరఫున హనుమ విహారి 37 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అంత‌కంటే ముందు విహారి హైద‌రాబాద్‌కు ఒక సీజ‌న్ మొత్తం ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక.. సీనియర్ బ్యాటర్ రికీ భుయ్ ఆంధ్ర జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆంధ్రా జట్టు తరఫున విహారి 30 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆంధ్ర బ్యాటర్లలో విహారి కూడా ఒకడు. 2018లో టీమిండియా టెస్టు జట్టులో డెబ్యూ చేసిన ఈ ఆంధ్రప్లేయర్.. ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు.


ఇలాంటి ప్లేయర్‌ సడెన్‌గా కెప్టెన్సీకి వీడ్కోలు పలకడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ‘బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించేందుకు విహారి కాస్త విరామం తీసుకోవాలనుకున్నాడు. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విహారిని తప్పించాలని ఎలాంటి ఒత్తిడి లేదు’ అని అప్పుడు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. కానీ, తాజాగా హనుమ విహారి చేసిన పోస్టులో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్ ఫైన‌ల్లో ఆంధ్రా జ‌ట్టు చివ‌రిదాకా పోరాడిన విజయం మాత్రం దక్కలేదు. మ‌ధ్యప్రదేశ్ చేతిలో 4 ప‌రుగుల తేడాతో పరాజ‌యం పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com