విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. క్రీడల్లో మెలకువలు నేర్పాల్సిన పీఈటీ మాస్టర్.. ఓ మైనర్ బాలిక మీద కన్నేశాడు. మాయమాటలతో ఆ బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక అస్వస్థతకు గురికావటంతో పీఈటీ మాస్టర్ చేసిన దారుణం బయటపడింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. పీఈటీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. విద్యార్థినిపై అత్యాచారం చేసి గర్భవతి కావడానికి కారణమైన పీఈటీ టీచర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూళ్లో ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇక అదే స్కూళ్లో పీఈటీ మాస్టర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఆ మైనర్ బాలిక మీద కన్నేశాడు. ఎలాగో మొబైల్ నంబర్ సంపాదించి చాటింగ్ చేస్తూ ఆ బాలికను మాటల్లోకి దింపాడు. ఆ తర్వాత ఓ రోజు త్రోబాల్ ప్రాక్టీస్ ఉందని పిలిచి ఇంటికి తీసుకెళ్లిన దుర్గాప్రసాద్.. బాలికను మాయమాటల చెప్పి లోబర్చుకున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలికకు కడుపునొప్పి రావటంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. ఆస్పత్రికి తీసుకువెళ్తే మైనర్ బాలిక గర్భవతి అనే అసలు విషయం బయటపడింది.
ఆ తర్వాత బాలిక కుటుంబసభ్యులు ఆమెనుగట్టిగా నిలదీయటంతో పీఈటీ మాస్టర్ చేసిన దారుణం వెలుగుచూసింది. దీంతో బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. పీఈటీ మాస్టర్ తన కూతురిపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పీఈటీ మాస్టర్ దుర్గా ప్రసాద్ మీద పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి.. అఘాయిత్యానికి ఒడిగట్టిన పీఈటీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తొమ్మిదో తరగతి బాలికపై పీఈటీ మాస్టర్ అఘాయిత్యం విశాఖలో కలకలం రేపింది. పీఈటీ మాస్టర్ లైంగిక దాడి ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన పీఈటీ మాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనకు స్కూలు యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసిన వాడిని అరబ్ దేశాల్లో శిక్షించిన తరహాలో శిక్షించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి పనిచేసే అవకాశం ఇవ్వకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి.