వైసీపీ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంగళవారం దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2,700 మందికిపైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశం ఏర్పాట్లను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతరులు కూడా ఉన్నారు.