మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మీద పోటీచేస్తానని ప్రకటించారు. పులివెందులలో జగన్‌ను ఢీకొడతానని వెల్లడించారు. వైఎస్ వివేకా కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన దస్తగిరి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్ఫంగా వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని అన్నారు. అలాగే తన రాజకీయ ప్రవేశంపైనా మాట్లాడిన దస్తగిరి.. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్‌పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా లేక ఇండిపెండెట్‌గా పోటీచేస్తారా అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.
ఇదే సమయంలో వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందన్న దస్తగిరి.. తెలంగాణ పోలీసులతో భద్రత కావాలని కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పులివెందులలో అరెస్ట్ అయిన వ్యవహారానికి సంబంధించిన అన్ని వివరాలను సీబీఐకు ఇచ్చానన్న దస్తగిరి.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. గన్‌మెన్లు, ఎస్కార్టు ఉన్న తాను కిడ్నాప్ ఎలా చేస్తానంటూ ప్రశ్నించారు. కక్షపూరితంగా తనపై కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు.. ఈ అంశం మీద దర్యాప్తు జరిపి సీబీఐ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
మరోవైపు ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి, కిడ్నాప్ చేయబోయాడనే కంప్లైంట్‌తో గతేడాది అక్టోబర్‌లో యర్రగుంట్ల పోలీసులు దస్తగిరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో కడప జైళ్లో వందరోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఇటీవలే బెయిల్ మీద విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి దస్తగిరి విడుదలయ్యారు. అయితే తనను కావాలనే కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని దస్తగిరి ఆరోపిస్తున్నారు.