క్యాన్సర్ బాధితుల్లో, హృద్రోగాలు, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారి శరీరాల్లో కణాలకు ఆక్సిజన్ తగినంతగా సరఫరా కాకపోవడమే వారి సమస్యలకు మూలకారణంగా గుర్తించామని 2019 వైద్య నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెంజా వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బయోఆసియా-2024 సదస్సులో జినోమ్ వ్యాలీ అవార్డు అందుకున్న అనంతరం ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ‘‘మానవ దేహంలో 50 ట్రిలియన్లకు పైగా కణాలు ఉంటాయి. వాటి డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసే అద్భుత యంత్రాంగం దేశంలో ఉంది. ఎర్ర రక్త కణాల ద్వారా రక్తనాళాల నుంచి మన శరీరంలోని కణాలన్నింటికీ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కానీ.. హృద్రోగులు, క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారి దేహంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరాలో సమతౌల్యం దెబ్బతినడాన్ని గుర్తించాం’’ అని ఆయన వివరించారు. ‘‘దీర్ఘకాలంగా మూత్రపిండాల వ్యాధి బారిన పడినవారిలో ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్ వల్ల ఎర్రరక్తకణాల ఉత ్పత్తి నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఎరిత్రోపొయిటిన్‌ను ఇంజక్షన్ ద్వారా అందించడం మొదలైంది. మా పరిశోధన సాధించిన తొలి విజయం ఇది’ అని డాక్టర్ సెమెంజా వివరించారు. ఇదే పద్ధతిలో క్యాన్సర్‌ను కూడా కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ ఉన్న వారిలో కణాలు వేగంగా పెరగడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని.. ఫలితంగా క్యాన్సర్ కణాలు చనిపోతాయి. కానీ ఆ చనిపోయేది క్యాన్సర్ కణితికి దూరంగా ఉన్న కణాలు మాత్రమేనని, దగ్గరగా ఉన్నవి తగినంత ఆక్సిజన్ లభించడంతో యథాతథంగా ఉంటాయని వెల్లడించారు. అవి ఎలాంటి చికిత్సకూ లొంగకుండా పోతున్నాయని.. అది మరింత ప్రమాదమని ఆందోళన వెలిబుచ్చారు. వాటినీ నిర్మూలించే దిశగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.