రాజధాని రైతుల ప్లాట్ల విషయంలో చట్టం నిర్దేశించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అనుసరించలేదని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భూసేకరణలో భాగంగా రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట వారికి కేటాయించే విషయాల్లో సీఆర్డీయే అనుసరించిన విధానం లోపభూయిష్ఠంగా ఉన్నదని తప్పుబట్టింది. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చింది. ఈ మేరకు సీఆర్డీయే ప్రొసీడింగ్స్‌ను, రైతులకు ఇచ్చిన నోటీసులను రద్దుచేసింది. రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసులు ఇచ్చి వారి అభ్యంతరాలు స్వీకరించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. చట్టనిబంధనలు అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారని స్పష్టం చేసింది. అధికారుల చర్యలు సివిల్ వివాదాలకు దారితీసేవిగా ఉన్నాయని హెచ్చరించింది. యజమానులకు నోటీసులు ఇచ్చి, వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్లాట్ల రద్దుపై రాతపూర్వక ఆదేశాలు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ప్రాధమిక న్యాయసూత్రాలను అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారని తేల్చింది. అయితే చట్ట నిబంధనలు, సహజ న్యాయసూత్రాలను అనుసరించి రైతులకు మరోచోట ప్లాట్ల కేటాయించే ప్రక్రియను కొనసాగించేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని సీఆర్డీయే, ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తీర్పు ప్రతి అందిన తరువాత వారం రోజుల్లో ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ప్లాట్లను ఎందుకు రద్దు చేయాల్సి వస్తుందో, చట్టంలోని ఏ నిబంధన ఆ అధికారం కల్పిస్తుందో అందులో పేర్కొనాలంది. ఆ తరువాత మూడు వారాల పాటు వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులకు స్పష్టం చేసింది. అనంతరం రైతులు తమ వాదనను నేరుగా వినిపించేందుకు రెండువారాల గడువు ఇవ్వాలని ఆదేశించింది. తదనంతరం రాతపూర్వకంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఆర్డీయే, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. సీఆర్డీయే నుంచి దస్త్రాలు కోరేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.