కుప్పంలో ఈ నాలుగేళ్లు వైసీపీది రక్త చరిత్ర కాగా చంద్రబాబు పాలనలో వేసింది అభివృద్ధి ముద్ర అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి తెలిపారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత సీఎం జగన్‌కు ఏమాత్రం లేదని ఆయన ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇసుక నుంచి వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని విమర్శించారు. మద్యం డిస్టిలరీలను నిర్వహిస్తూ పేదల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేశారని, భూఆక్రమణలతో కుప్పం నుంచి పీలేరు వరకూ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కుప్పం నడిబజార్‌లో చెరబట్టి గెలుపు దక్కించుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల క్రితమే చంద్రబాబు పులివెందులకు తాగు నీరు, సాగునీరు అందించిన విషయం మరిచిపోవడమేమిటని ప్రశ్నించారు. ఒకప్పటి టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు వెంపర్లాడుతున్నారని పులివెందులకు ఎవరు నీళ్లు పారించారో సతీశ్‌రెడ్డే చెబుతారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయలేని పనిని చేసి చూపించిన చంద్రబాబుకు పులివెందుల బహిరంగసభలో సతీశ్‌రెడ్డి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్‌లాంటి పథకాల ద్వారా కుప్పం రైతుల జీవితాలను సమూలంగా మార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 2017లో మదనపల్లె తిరుపతి హైవే మంజూరైతే దాని ఘనత తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని కిశోర్ విమర్శించారు. ఐదేళ్ల క్రితమే మదనపల్లె వరకూ హంద్రీ నీవా నీళ్లను చంద్రబాబు పారించారని, అప్పుడే కుప్పానికి పథక రచన జరిగిందని గుర్తు చేశారు. ఈనెల 29వ తేదీ నుంచి పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు చీరలు, ప్యాంట్లు, షర్టులు పంపిణీ చేయబోతున్నారని, వైసీపీ నిజంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేసి ఉంటే ఈ అడ్డమైన పనులెందుకని నిలదీశారు. పూర్తి మద్యపానం చేసి ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చిన సీఎం నాసి రకం మద్యం సరఫరా చేసి వేలాది మంది ప్రాణాలను హరించారని, లక్షలాది మంది ఆరోగ్యాలను గుల్ల చేశారని చెప్పారు. మద్యం షాపులను కొనసాగిస్తూనే ఎన్నికలు వెళుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును వేలెత్తి చూపే అర్హత సీఎంకు గానీ, పెద్దిరెడ్డికి గానీ లేదని పదే పదే అంశాలవారీగా విశదీకరించారు.