తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అపచారం జరిగింది. ధర్మకర్తల మండలి నిర్లక్ష్యంతో.. అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం నెల్లూరు జిల్లాకు చెందిన భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి రావణాసురుడి విగ్రహాన్ని బహూకరించారు. అయితే తయారు చేసే సమయంలో చూసుకోకుండాపొరపాటున జరిగిందో.. నిర్లక్ష్యమో తెలియదు కానీ.. దశకంఠుడు అయిన రావణుడు కాస్తా నవకంఠుడిగా మారిపోయాడు. పది తలల రావణుడు కాస్తా తొమ్మిది తలల రావణాసురుడిగా మారిపోయాడు. ఈ విషయంపై ఇప్పుడు భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మార్చి ఆరోతేదీన రావణాసురుడి వాహన సేవ జరగనుంది. ఈ వాహనసేవ కోసం రావణాసురుడి వాహనాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం నెల్లూరు చెందిన భక్తులు రావణాసురుడి విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. అయితే విగ్రహాన్ని తయారుచేసే సమయంలో పది తలలతో తీర్చి దిద్దాల్సింది పోయి.. 9 తలలతోనే రావణ బ్రహ్మ విగ్రహం రూపొందించారు. అయితే ఇది గుడి వద్దకు చేరేవరకూ అటు రూపకర్తలు, ఇటు ధర్మకర్తల మండలి సిబ్బంది తప్పును గ్రహించలేకపోయారు.
ఆలయం వద్ద ఈ విగ్రహాన్ని గమనించిన భక్తులు.. ధర్మకర్తల మండలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయనే కనీస అవగాహన ధర్మకర్తల మండలికి లేదా అంటూ భక్తులు విమర్శిస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలపై అధికారులకు అవగాహన లేక పోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పును గ్రహించిన అధికారులు వెంటనే విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేయించారు. రావణాసురుడికి పదో తలను అతికించే పనిలో పడ్డారు.
మరోవైపు ఇటీవలే శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ బాలుడు అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన ఘటన కలకలం రేపింది. కాంపౌడ్ గోడ నుంచి నిచ్చెన ద్వారా బాలుడు ఆలయంలోకి ప్రవేశించడంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇది జరిగి పదిరోజుల కూడా జరగకముందే మరోసారి శ్రీకాళహస్తి ఆలయం వార్తల్లోకి ఎక్కింది.