టీడీపీ. జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభకు కార్యకర్తలు పోటెత్తారు. కూటమి తరఫున అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత రెండు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇది. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు కదం తొక్కారు. టీడీపీ తమ్ముళ్లు, జనసైనికుల ఉత్సాహంతో సభాప్రాంగణం వద్ద కోలాహలం నెలకొంది. భారీగా వచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు, వారి చేతిలో జెండాతో ఆ ప్రాంగణమంతా పసుపు, తెలుపుమయంగా మారిపోయింది. సభా ప్రాంగణానికి పది కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు బైక్ మీద సభకు చేరుకున్నారు. ఈ సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.