బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించే సిద్దం సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సిద్ధం సభలు పూర్తికాగా.. నాలుగో సభ మరింత గ్రాండ్‌గా ఉండేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగో సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి పదో తేదీన జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి మూడో తేదీన మేదరమెట్లలో సిద్ధం సభ జరగాల్సి ఉంది. అయితే మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద మార్చి 3 న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభను మార్చి పదో తేదీన జరపాలని నిర్ణయించినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
సిద్ధం సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందోన్న విజయసాయిరెడ్డి .. మేదరమెట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. మొత్తం15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. 98 ఎకరాల విస్తీర్ణంలో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి వివరించారు. మేదరమెట్ల సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు వస్తారని అన్నారు. ప్రభుత్వ పధకాలు, పాలనపై పార్టీ కేడర్, ప్రజలకు జగన్ దిశానిర్దేశం చేస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు.
మరోవైపు ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చనే దానిమీద విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 13, 14వ తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం చేసిందన్న విజయసాయిరెడ్డి.. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం కలుగుతోందని అన్నారు. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టోపైనా కసరత్తు జరుగుతోందని.. అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ మొదటి నుంచి ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్న విజయసాయిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లోనూ అదే విధానం కొనసాగుతుందన్నారు.