నెల్లూరు, కర్నూలు లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా స్థానాలలో కొత్తవారిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ తరుపున నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని బరిలో దించాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అరబిందో ఫార్మా డైరెక్టర్‌గా ప్రస్తుతం శరత్‌చంద్రారెడ్డి కొనసాగుతున్నారు. అయితే నెల్లూరు వైసీపీ సీనియర్ లీడర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో శరత్ చంద్రారెడ్డిని బరిలోకి దింపాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమచారం.
మరోవైపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డి నిందితునిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎపీ టికెట్ ఇవ్వాలా లేదా వేరేవారిని ఎవరైనా బరిలో నిలపాలా అనే దానిపైనా కూడా వైసీపీ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ మీద అసంతృప్తితో ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి త్వరలోనే సైకిల్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్‌ను బరిలో నిలపాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంతియాజ్ అహ్మద్ ప్రస్తుతం సెర్ప్ సీఈవోగా, సీసీఎల్‌ఏ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. టికెట్ ఖరారయ్యే పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. దీనిపైనా ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు.
అయితే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఇటీవల మంత్రి గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం నియమించింది. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. మరోసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం మాత్రం ఆయన్ని లోక్‌సభ బరిలో నిలపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ మీద అసంతృప్తితో ఉన్న గుమ్మనూరు జయరాం అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఈయన కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చేరి ఆలూరు లేదా గుంతకల్లు స్థానం నుంచి పోటీ చేయాలని జయరాం భావిస్తున్నట్లు తెలిసింది.