జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని.. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా కలుస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి తన వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ పవన్‌తో చేయించాలని అనుకున్నట్లు తెలిపారు. ‘‘మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారు. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డా. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించా. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడరు బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితం అయిపోయారు. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదు. చరిత్ర తిరగరాసినట్టు అయ్యింది. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలను. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారు. పవర్ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సింది. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదు. భగవంతుడ్ని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటాన్నా. కాని మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా.. తుప్పు పట్టిన ఇనుము లాంటివాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు .. రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను’’ అంటూ ముద్రగడ లేఖ రాశారు.