తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లోకేష్ పెత్తనమే నడుస్తోందని.. సీనియర్లకు గౌరవంలేదని పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారిపోయిందని అన్నారు. శుక్రవారం (మార్చి 1) సాయంత్రం తాడేపల్లిలో ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో సతీష్ రెడ్డి మాట్లాడారు. తాను 27 సంవత్సరాలుగా టీడీపీ కోసం పని చేశానని.. వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా సీఎం జగన్ తనను ఆహ్వానించారని అన్నారు.
‘వైఎస్ కుటుంబానికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడినా.. జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. ఇకపై జగన్ ఏం చెబితే, అదే చేస్తా’ అని సతీష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోతుందని సతీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్థం కోసం మళ్లీ రాయబారం చేశారని ఆరోపించారు. ‘నాతో వైసీపీ నేతలు టచ్లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు’ అని ఆయన చెప్పారు.