ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో పార్టీ కీలక నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన కొంత మంది నేతలు.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సహా ఏపీకి చెందిన పలువురు నేతలను కలిసి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని భావిస్తుండగా.. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జాబితా విడుదల చేయడమే కాకుండా, ఉమ్మడిగా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ కూడా తమతో కలిసి పనిచేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొంత కాలంగా దీమాగా చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీ పెద్దలను ఒప్పించడానికి తాను తిట్లు కూడా తినాల్సి వచ్చిందంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని భావించడం అటు జనసేనకు, ఇటు టీడీపీకి పెద్ద దెబ్బే అవుతుంది. అంతేకాదు.. టీడీపీ, జనసేన నుంచి వచ్చే నేతలను, టికెట్లు రాని వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తుల అంశంపై పలుమార్లు చర్చించారు. ఈ చర్చలు ఓ కొలిక్కి రాకముందే జనసేన-టీడీపీ కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌జీ నేతృత్వంలో హైదరాబాద్ నగర శివార్లలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ భేటీకి ఏపీ నుంచి 10 మంది ముఖ్య నేతలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికలకు సంబంధించి పొత్తులు సహా వివిధ ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తులే కాకుండా, సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని పార్టీ నేతలకు శివప్రకాశ్‌జీ సూచించినట్లు తెలుస్తోంది.
పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే.. టీడీపీ-జనసేన కూటమి పరిస్థితి ఏమిటి? పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బీజేపీ విడిగా పోటీ చేస్తే, అది ఎవరికి నష్టం? అనేవి చర్చనీయాంశాలుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల అంశంపై బీజేపీ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa