పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ విలువ ఇవ్వరని హరిరామజోగయ్య కుమారుడు, జనసేన పీఏసీ కమిటీ సభ్యుడు చేగొండి సూర్య ప్రకాష్ అన్నారు. సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు పవన్ కళ్యాణ్ ఇంటి బయట నిలబడాలని ఆరోపించారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే అని విమర్శించారు. ఆరు సంవత్సరాలుగా జనసేన కోసం పనిచేస్తే ఇప్పటివరకూ కేవలం అరగంట మాత్రమే తనతో మాట్లాడారని చెప్పారు. శుక్రవారం (మార్చి 1) సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో చేగొండి సూర్యప్రకాష్ మాట్లాడారు.
చంద్రబాబు నాయుడినో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని సూర్యప్రకాష్ వ్యాఖ్యానించారు. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు ఎక్కడా కనిపించడంలేదని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్‌ను నమ్మి మోసపోయారని ఆరోపించారు. జనసేన పీఏసీ సభ్యులుగా ఉన్న తనకే పార్టీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సూర్యప్రకాష్ ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప పవన్ ఎవరి మాటలూ వినరని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, వైసీపీ కోవర్టులు అంటూ ముద్రవేస్తున్నారని ఆరోపించారు.
‘ఏం ఆశించి జనసేన పార్టీ పెట్టారో అర్థం కావడంలేదు. పవన్ కళ్యాణ్ ని నమ్మి జనసేనలో చేరాను. పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా. పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయం చేయలేరు. ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు. ఆ పార్టీలో ఉండటం మనసొప్పక బయటకు వచ్చాను’ అని సూర్యప్రకాష్ అన్నారు.
సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుణ్ని పవన్ కళ్యాణ్‌నే చూశారని సూర్యప్రకాష్ ఎద్దేవా చేశారు. ‘ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపే కంటే, క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది. అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు? ఏం లబ్ధి చేకూరగం వలన చంద్రబాబు పంచన చేరారు?’ అని చేగొండి సూర్యప్రకాష్ ప్రశ్నించారు. జగన్ గట్స్ ఉన్న లీడర్ అని, అలాంటి నాయకుడి వెనుక నడవాలని అనుకుంటున్నానని సూర్యప్రకాష్ అన్నారు. ఏం ఆశించకుండా పార్టీలో చేరానని తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa