ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్.. 14 రోజులు రిమాండ్, విజయవాడలో హైడ్రామా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 09:27 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్ అయ్యారు. జీఎస్టీ ఎగవేతకు, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు శరత్ బాబు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున శరత్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన డీజీడీఐ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌).. అవెక్సా కార్పొరేషన్‌లో తనిఖీలు చేసి, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంటూ రూ. 16 కోట్లు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని 2022 ఆగస్టులో నోటీసు జారీ చేసింది.


ఆ సమయంలో అవెక్సా కార్పొరేషన్‌ తరఫున ఏపీలోని విజయనగరంలో ఏర్పాటైన బ్రాంచి ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేంద్రం జారీ చేసిన నోటీసు ఆధారంగా రాష్ట్రంలోనూ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూపంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ విచారణ నిర్వహించాలని మాచవరం పోలీసులకు రాష్ట్ర డీఆర్‌ఐ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కేంద్ర సంస్థ జారీ చేసిన నోటీసును జతచేశారు. శరత్‌బాబు ఆ సంస్థకు అదనపు డైరెక్టర్‌గా రెండు నెలలు కూడా లేని శరత్‌ను అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. నిర్మాణ పనులకు సంబంధించి బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ నుంచి అవెక్సా కార్పొరేషన్‌ సబ్‌కాంట్రాక్టులు పొందింది. 2017లో రాజధాని అమరావతిలోని సీడ్‌ యాక్సెస్‌ ఎన్‌ 9 (ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు) రోడ్డు నిర్మాణ పనులను తీసుకుంది.


టాటా ప్రాజెక్టు నుంచి ఏపీ టిడ్కో ప్రాజెక్టు పనులు, ఎన్‌సీసీ లిమిటెడ్‌ నుంచి మిడ్‌ పెన్నా దక్షిణ కాలువ (అనంతపురం), సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ నుంచి 800 హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణం పనులు తీసుకుని చేపట్టింది. ఈ క్రమంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అక్రమంగా లబ్ధి పొందినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అవెక్సా కార్పొరేషన్‌కు శరత్‌ 2019 డిసెంబరు 9 నుంచి 2020 ఫిబ్రవరి 14 వరకు అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో జీఎస్టీ ఎగవేత జరిగిందన్న ఆరోపణలపై మాచవరం పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరి 25న కేసు నమోదైంది. పుల్లారావు కుమారుడు శరత్‌తో పాటు కుర్రా జోగేశ్వరరావు (డైరెక్టర్‌), బొగ్గవరపు నాగమణి (అదనపు డైరెక్టర్‌), పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకాయమ్మ (డైరెక్టర్‌), బొగ్గవరపు అంకమరావు (డైరెక్టర్‌), బొగ్గవరపు మార్కండేయులు (డైరెక్టర్‌), పి.భీమరాజు (అదనపు డైరెక్టర్‌)లను నిందితులుగా చేర్చారు. వీరిలో జోగేశ్వరరావు, నాగమణి మాత్రమే ప్రస్తుతం అవెక్సా సంస్థకు డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వారందరికీ ప్రస్తుతం సంస్థతో ఎటువంటి సంబంధాలు లేవు. నిందితుల జాబితాలో ఉన్న మార్కండేయులు మరణించారు.


శరత్‌ను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం, కమాండ్‌ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. దీంతో శరత్‌ ఆచూకీ తెలియక పుల్లారావుతో పాటు, టీడీపీ నేతలు ఆందోళన చెందారు. కుమారుడి అరెస్టు ఉదంతంపై ప్రత్తిపాటి పుల్లారావు కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్‌, పట్టాభి, దేవినేని ఉమా, తదితరులను చూసి పుల్లారావు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడిపై అక్రమంగా కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను నేతలు ఓదార్చి ధైర్యం చెప్పారు. శరత్‌ అరెస్టును టీడీపీ నేతలు ఖండించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అన్నారు.


ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. శరత్‌ను గురువారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న అనంతరం విజయవాడకు తీసుకొచ్చారు. గురువారం రాత్రి వైద్య పరీక్షల అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి కరీముల్లా నివాసంలో పోలీసులు శరత్‌ను హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో 409 సెక్షన్ చెల్లదన్నారు. 469 సెక్షన్‌ను పరిగణనలోకి తీసుకుని 14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు శరత్‌ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.


తన కుమారుడు కంపెనీలో డైరెక్టర్‌గా కూడా లేరు, కనీసం షేర్ హోల్డర్ కూడా కాదని.. అలాంటి వ్యక్తికి, జీఎస్టీ ఎగవేతలకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందిని సీఎం లను చూశానని.. అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను అన్నారు. కానీ ఇలాంటి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు, దాడులు, అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడలేదన్నారు. అక్రమ కేసులకు భయపడేది మాత్రం లేదని.. దీటుగా ఎదుర్కొంటామన్నారు. న్యాయపరమైన మార్గాల ద్వారా చేయాల్సినది చేస్తామని తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com