బెంగళూరులో సంచలనంరేపిన హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆమెను విజయవాడకు చెందిన మేనల్లుడే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న జశ్వంత్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు విచారణలో తన మేనత్త సుకన్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె ఎలక్ట్రానిక్స్ సిటీకి సమీపంలో దొడ్డతొగూరులో నివాసం ఉంటుండగా.. హత్య చేసి బింగపురా సమీపంలో మృతదేహాన్ని కాల్చేసినట్లు తేల్చారు.
నరసింహారెడ్డి, సుకన్య దంపతులు బెంగళూరు శివారులోని దొడ్డతొగూరులో నివాసం ఉంటున్నారు. సుకన్య హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుండగా.. ఆమె భర్త నరసింహారెడ్డి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల (ఫిబ్రవరి) 13న తన భార్య కనిపించడం లేదని నరసింహారెడ్డి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 12న ఉద్యోగ విధుల కోసం వెళ్లిన తన భార్య సుకన్య తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు సుకన్య కాల్ డేటా ఆధారంగా బయటకు తీశారు.. ఈ క్రమంలో సుకన్యకు జశ్వంత్ రెడ్డి అనే యువకుడికి తరచుగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. అలాగే ఈ నెల (ఫిబ్రవరి) 12న సుకన్యతో పాటుగా జశ్వంత్ మొబైల్ సిగ్నల్స్ కేఆర్ పురం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు వెంటనే జశ్వంత్ రెడ్డి వివరాలు ఆధారంగా దర్యాప్తు చేశారు. జశ్వంత్ సుకన్యకు మేనల్లుడని తేలింది.. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి మంగళవారం (ఫిబ్రవరి 27న) బెంగళూరు తీసుకొచ్చారు. అతడిని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. తాను సుకన్యతో రెండు నెలల క్రితం మాట్లాడానని.. ఆమె ఎక్కడుందో కూడా తనకు తెలియదని పోలీసులకు చెప్పాడు. కాల్ రికార్డులు, టవర్ లొకేషన్ వివరాలతో సహా అడిన వెంటనే తడబడ్డాడు.. అప్పుడు మొత్తం స్టోరీ బయటపడింది.
ఈ నెల 12న అద్దె కారులో తన మేనత్త సుకన్యను కలిసేందుకు బెంగళూరు వచ్చానని చెప్పాడు. ఆమె బంగారు ఆభరణాలను దోచేసినట్లు చెప్పాడు. సుకన్య పనిచేసే ప్రాంతానికి వెళ్లి ఆమెను ఇంటి దగ్గర దిగబెడతానని మాయ మాటలు చెప్పాడు. ఆమె కారు ఎక్కగానే ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి.. తనకు అప్పులు చాలా ఉన్నాయని.. డబ్బులు కావాలని అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని సుకన్య చెప్పింది.. వెంటనే జశ్వంత్ ఆమె గొంతు నులిమి మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్‌ను తీసుకున్నాడు. ఆమె చనిపోయిందని నిర్థారించుకుని.. బింగిపుర సమీపంలో మృతదేహాన్ని పడేశాడు.
జశ్వంత్ అక్కడి నుంచి బయల్దేరి హోసూరు వెళ్లాడు.. అక్కడ ఐదు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి మళ్లీ మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి వెళ్లాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే వేచి ఉన్నాడు. అక్కడి నుంచి కేఆర్ పురం వచ్చి సుకన్య మొబైల్‌ను ఓ తోటలోకి విసిరేశాడు. బెంగళూరు నుంచి బయల్దేరి హైదరాబాద్ వచ్చి రూ.95వేలకు సుకన్య బంగారు చైన్‌ను అమ్మేశాడు. ఆ డబ్బులో రూ.50వేలతో తన అప్పు తీర్చాడు.. మిగిలిన డబ్బులు తీసుకుని స్నేహితులతో గోవాకు వెళ్లి పార్టీ చేసుకున్నాడు. అక్కడ నుంచి తిరిగి విజయవాడ వెళ్లిపోయి ఏమీ తెలియనట్లుగా రోజూ కాలేజీలో క్లాసులకు వెళుతున్నాడు. అయితే కాల్ డేటా ఆధారంగా ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశాడు.
జశ్వంత్ మరో విషయాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. గతేడాది అక్టోబర్‌లో జశ్వంత్ రెడ్డి వేరే వారి వాహనం తీసుకెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి కేసు పెట్టొద్దని వాహనం డ్యామేజ్ కావడంతో రూ.50వేలు ఇస్తానని యజమానికి చెప్పాడు. అయితే తన మేనత్త సుకన్యను డబ్బులు అడిగి తీసుకోవాలని భావించాడు. అందుకే బెంగళూరు వచ్చాడు.. డబ్బుల కావాలని సుకన్యను అడిగాడు. ఆమె తన దగ్గర లేవని చెప్పడంతో ఆమెను చంపి మెడలో చైన్‌ను తీసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలంలో మృతురాలు సుకన్యకు సంబంధించిన కొన్ని ఎముకల్ని, కాలిన కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.50వేల కోసం వెళ్లి అనుకోకుండా హత్య కేసులో చిక్కుకుని అరెస్ట్ అయ్యాడు జశ్వంత్ రెడ్డి.