‘‘జగనన్న మూడు రాజధానుల నాటకాలాడారు. ఒక్క రాజధానినైనా జగన్ అభివృద్ధి చేశాడా? మనకు సిగ్గుచేటు కాదా? పక్క రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి పథంలో నడుస్తుంటే మనం మాత్రం వెనుకబడిపోతున్నాం. దక్షిణాదిన మెట్రోలేని ఏకైక రాష్ట్రం మనదే. తల్లిలాంటి ఏపీని మోదీ, జగన్ హత్య చేశారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా రావడంతో రెండు వేలు, హిమాచల ప్రదేశ్‌లో పదివేల పరిశ్రమలు వచ్చాయి. ఏపీకి పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న హోదా కోసం నిరాహార దీక్ష చేశారు. హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తానన్న జగన్... సీఎం అయ్యాక మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు ఒక్క ఎంపీ కూడా ఎందుకు రాజీనామా చేయలేదు జగనన్నా? బీజేపీని ఎందుకు నిలదీయలేదు? ఢిల్లీలో పంజా విప్పుతామన్నారు. ఇప్పుడేమైంది? గల్లీలో జగనన్న పులి, ఢిల్లీకి వెళితే పిల్లిగా మారిపోతున్నారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు లేకపోయినా బీజేపీనే మన రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. పాలక, ప్రతిపక్షాలు బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తోంది’’అని షర్మిల ఎద్దేవా చేశారు.