శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్ఈబీ పోలీసుల తనిఖీలు జరిగాయి. పోలీసులకు మిరప చేనును చూసి అనుమానం వచ్చింది.. వెంటనే పరిశీలిస్తే అసలు గుట్టు బయటపడింది. ఈ రైతు ఎవరికి దొరక్కుండా పెద్ద ప్లాన్ వేశాడు. కానీ ఎస్ఈబీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మిరప చేనులో ఏం జరిగిందో తెలిసి అందరూ అవాక్కయ్యారు.
గుడిబండ మండలం మందలపల్లికి చెందిన హనుమంతరాయప్ప అనే రైతు మిరప, వక్క తోటలు వేశాడు. పనిలో పనిగా హనుమంతరాయప్ప తన పొలంలో వక్క, మిరప తోట ముసుగులో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న హనుమంతురాయప్ప బండారాన్ని తోటి రైతులే బయటపెట్టారు. రోజూ మిరప చేనుకు వెళ్లి గంజాయి మొక్కలకు నీళ్లు పెడుతున్న హనుమంతరాయప్ప వ్యవహరశైలిపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పక్కా సమాచారంతో సెబ్ అధికారులు మిరప చేనులో తనిఖీలు చేశారు. హనుమంత రాయప్ప తోటలో గంజాయి మొక్కల్ని సీజ్ చేశారు. మిరప తోట మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా 13 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. రైతు హనుమంతరాయప్ప చేత 13 గంజాయి మొక్కలను పీకించి, అతనిపై కేసు నమోదు చేశారు సెబ్ అధికారులు. రైతును అరెస్ట్ చేసిన సెబ్ అధికారులు రిమాండ్‌కు తరలించారు.