ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోటీ నుంచి తప్పుకుంటున్నా.. మహాసేన రాజేష్ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 09:34 PM

టీడీపీ - జనసేన కలిసి 99 మంది అభ్యర్థులతో విడుదల చేసిన తొలి జాబితాలో ఒక అభ్యర్థి తప్పుకున్నారు. తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచిన మహాసేన రాజేష్ (సరిపెళ్ల రాజేష్‌) సంచలన ప్రకటన చేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో వైరల్ అవుతోంది. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం తనకు వ్యతిరేకంగా ఏకమైందని, కులరక్కసి చేతిలో బలైపోయానని రాజేష్ వ్యాఖ్యానించారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల తరఫున గొంతుక వినిపిస్తుంటే.. తనపై జరుగుతున్న దాడిని గమనించాలని ఎస్సీ వర్గాలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.


టీడీపీ తొలి జాబితాలోనే పి. గన్నవరం (కోనసీమ జిల్లా) అభ్యర్థిగా రాజేష్‌ను ప్రకటించారు. రాజేష్‌కు టికెట్ కేటాయించిన మరుక్షణం నుంచే హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గతంలో సోషల్ మీడియా వేదికగా రాజేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నిరసనలకు దిగాయి. అటు పి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన శ్రేణుల నుంచి రాజేష్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రాజేష్‌కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరిగాయి. మహాసేన రాజేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం అంబాజీపేటలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో జనసేన కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు.


మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం టికెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు శుక్రవారం (మార్చి 1) విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజేష్‌కు టికెట్‌ ఇవ్వడం అంటే బ్రాహ్మణులను టీడీపీ అవమానించినట్లేనని పేర్కొన్నారు. మహాసేన రాజేష్‌కు టీడీపీ ఇచ్చిన పి.గన్నవరం టికెట్‌ను వెంటనే రద్దు చేయాలని కర్నూలులో జరిగిన సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్‌ చేసింది.


మహాసేన రాజేష్‌కు టికెట్‌ కేటాయించడంపై అటు టీడీపీ చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ తగిలింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పలువురు హిందూ సంఘాల నేతలు హెచ్చరించారు. హిందూ దేవుళ్లు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రాజేష్‌పై టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోకవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది.


 పరిణామాల నేపథ్యంలో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమోదంతోనే రాజేష్ ఈ ప్రకటన చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధిష్టానం సూచనతోనే మహాసేన రాజేష్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ‘నోర్లులేని మేకల్ని బలి ఇస్తారు.. సింహాన్ని కాదు. మీరు బలి అవుతారో లేక సింహం మాదిరిగా రాష్ట్రాన్ని కాపాడతారో నిర్ణయం మీదే’ అంటూ రాజేష్‌కు మద్దతుగా ఆయన అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com