ఆమె ఓ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఊరు వైజాగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలు, మత్తెక్కించే రీల్స్.. పోస్ట్ చేస్తూ.. నెటిజన్లకు కనుల విందు ఇస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ఒకటి అర చిన్న సినిమాల్లోనూ నటించిందండోయ్. ఇలా అందంతో యూత్‌ను పిచ్చెంక్కించటమే కాదు.. ఈ బొద్దుగుమ్మలో మరో యాంగిల్ కూడా ఉందండోయ్. సోషల్‌మీడియాలో పరిచయమైన స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. తనకు అలవడిన యాక్టింగ్ కళకు చోరకళ కూడా యాడ్ చేసి.. ఎవరికీ తెలియకుండా బంగారం కొట్టేసింది. వాటిని అమ్మేసి.. గోవాకు మకాం మార్చి జల్సాలు చేస్తూ.. హీటెక్కించే రీల్స్‌తో రెచ్చిపోతోంది. తీరా.. అసలు విషయం బయటపడటంతో మన రీల్స్ సుందరి.. జైల్‌లో ఊచలు లెక్క పెడుతోంది.
వివరాల్లోకి వెళ్తే... విశాఖ నగరంలోని దొండపర్తి బాలాజీ మెట్రో అపార్టుమెంటులో ప్లాట్ నంబర్ 102లో పోస్టల్ శాఖ రిటైర్డ్ అధికారి జనపాల ప్రసాద్ బాబు.. తన కుమార్తె మౌనికతో కలిసి నివాసముంటున్నారు. వీళ్లు.. ఫిబ్రవరి 23న యలమంచిలిలో బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈక్రమంలోనే బంగారు ఆభరణాల కోసం బీరువా లాకర్ తెరవగా అందులోని 150 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో.. ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించింది.
ప్రసాద్ బాబు, ఆయన కుమార్తెను పోలీసులు విచారించగా.. ఇటీవల వాళ్లింట్లోకి వచ్చిన కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. జనవరి 29, ఫిబ్రవరి 19 తేదీల్లో తన కుమార్తె స్నేహితులైన భార్యభర్తలు, మరికొంతమంది ఇంటికి వచ్చారని.. బాత్రూమ్‌కి వెళ్లాలన్న సాకుతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చారని మౌనిక తెలిపింది. దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే.. మన హీరోయిన్ బండారం బయటపడింది.
ఈ కేసులో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్యనే ప్రధాన నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు. ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య.. "ట్రిప్" అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం శివమ్ అనే చిత్రంలోనూ చేస్తోంది. గతంలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన సౌమ్యకు.. 2016లో మౌనికతో పరిచయం ఏర్పడింది. స్నేహం పేరుతో తరుచూ మౌనిక ఇంటికి వచ్చే సౌమ్య.. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బాత్రూమ్ వాడుకునేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి చాలా టైమ్ వరకు బయటికి వచ్చేది కాదు. అలా రెండు మూడుసార్లు చేసిన సౌమ్య తన సరైన సమయం చూసి.. తనలో దాగున్న చోరకళను బయటకు తీసి.. బంగారాన్ని మాయం చేసింది.
సౌమ్యపై తమకు అనుమానం ఉందని ప్రసాద్ కుమార్తె చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించగా.. అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో.. ఆమె దగ్గరున్న 74 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారం గురించి అడిగితే.. తన దగ్గర అంతే ఉందని.. మిగిలింది ఇవ్వలేనని చెప్పేసింది. ఇంకా గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరిస్తూ.. తమ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. దీంతో.. సౌమ్యను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.