తిరుమల శ్రీవారికి మరోసారి భారీగా ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి నెలలో శ్రీవారిని 19లక్షల 06వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ.111.71 కోట్ల ఆదాయం వచ్చింది. 95లక్షల 43 వేల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. అటు 43 లక్షల 61వేల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 6.56 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక అన్నమయ్య భవన్ లో నిర్వహించారు. భక్తుల సందేహాలకు ఈవో ధర్మారెడ్డి సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయన్నారు. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించామన్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించామన్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం(చిన్నపిల్లల గుండె ఆసుపత్రి) ప్రారంభమైన రెండేళ్ల కాలంలోనే 12 గుండె మార్పిడి ఆపరేషన్లు, 2485 గుండె ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యబృందాన్ని అభినందించారు.
స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి గైనకాలజీ, ఒబెస్ట్రిక్స్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఇఎన్‌టి, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలలో నగదు రహిత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని.. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం నిర్వహిస్తామన్నారు. మార్చి 25న తుంబురుతీర్థ ముక్కోటి నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో మార్చి 20న అమలక ఏకాదశి, మార్చి 25న లక్ష్మీ జయంతి, ఏప్రిల్ 2న శీతలాష్టమి పూజ నిర్వహిస్తామని.. వీటిని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తామన్నారు.
టీటీడీ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.. మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు - తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్నారు.
మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు - హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.. మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు - తొండమాన్‌పురంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు - తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తారన్నారు.