ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతీ రాజకీయ నాయకుడు అనుకుంటారు. ఇక సిట్టింగ్‌లు అయితే మళ్లీ తమ సీటును ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక బీజేపీ లాంటి జాతీయ పార్టీలో సీటు దొరకాలంటే అది చాలా కష్టం. సొంత ఇమేజ్‌తోపాటు బీజేపీ కార్యకర్తల బలం.. అన్నింటినీ మించి ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాతో విజయం సాధించే అవకాశం ఉండటంతో అంతా ఎన్నికల సీటు కోసం హోరాహోరీగా పోరాటం చేస్తూ ఉంటారు. అధికార పార్టీలో సీట్ల కేటాయింపు కోసం తీవ్రమైన పోటీ ఉండగా.. బీజేపీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు మాత్రం ఒకే రోజు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటామని.. తమకు సీటు కేటాయించవద్దని కోరడం తీవ్ర సంచలనంగా మారింది. అసలు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు గౌతం గంభీర్, జయంత్ సిన్హాలు ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు అనే విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరినట్లు శనివారం ఉదయం ట్విటర్ వేదికగా వెల్లడించారు. సరిగ్గా 5 గంటల తర్వాత జార్ఖండ్‌లోని హజారీబాగ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న జయంత్ సిన్హా కూడా అచ్చం అలాంటి ట్వీట్ చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్లు జయంత్ సిన్హా వెల్లడించారు. అయితే బీజేపీ లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. ప్రతీ లోక్‌సభ స్థానంపై విస్తృతంగా సర్వేలు నిర్వహించి.. సుదీర్ఘ చర్చల తర్వాత అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే తూర్పు ఢిల్లీలో గౌతమ్ గంభీర్‌తో పాటు హజారీబాగ్‌లో జయంత్ సిన్హాలకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరే కాకుండా పనితీరు సరిగా లేని వాళ్లకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని కమలం పార్టీ హై కమాండ్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా ప్రస్తుతం బీజేపీకి ఉన్న 300 లకు పైగా ఎంపీల్లో కనీసం 60 మంది సిట్టింగ్‌లకు మరోసారి టికెట్ ఇవ్వకూడదని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రకటించడానికి ముందే గౌతం గంభీర్, జయంత్ సిన్హా.. 2024 లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం.
ఇక గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షా సహా బీజేపీ పెద్దలు భేటీ అయి 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా 34 మంది కేంద్రమంత్రులతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.