ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి.. 1000 కిపైగా కొత్త అమృత్ భారత్ రైళ్లు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 10:28 PM

మన దేశంలో నిత్యం కోట్లాదిమంది రైలు ప్రయాణాలపై ఆధారపడతారు. తక్కువ ధరకు ఎక్కువ దూరం, సుఖవంతమైన ప్రయాణాలు సహా ఎన్నో అవసరాలకు ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులతోపాటు సరికొత్త, అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ పొందాయి. ఛార్జీలు ఎక్కువగా ఉన్నా అత్యాధునిక సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణాన్ని ఈ వందే భారత్ రైళ్లు అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైళ్లను గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇవి ఎక్కువ ప్రజాదరణ పొందడంతో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వే శాఖ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మరో వెయ్యికి పైగా రైళ్లు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది.


దేశంలో అధునాతన అమృత్ భారత్‌ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తాజాగా వెల్లడించారు. రానున్న కొన్నేళ్లలో భారతీయ రైల్వే వెయ్యికి పైగా ఈ అమృత్‌ భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వీటితోపాటు రైలు వేగాన్ని పెంచేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను తయారు చేసే పనిలో ఉన్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా-హావ్‌డా నగరాలను కలుపుతూ.. దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 6 వ తేదీన ప్రారంభించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.


ప్రతీ సంవత్సరం భారతీయ రైల్వేలు 700 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇక రైలు ప్రయాణాల విషయంలో ఒకరికి రూ.100 ఖర్చవుతుండగా.. రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. ఇక అమృత్‌ భారత్‌ రైళ్లలో 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. కేవలం రూ.454 మాత్రమే ఖర్చు అవుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఐదేళ్లలో వందే భారత్‌ రైళ్లను మన దేశం ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. యువతలో వందే భారత్‌ బాగా ప్రాచుర్యం పొందిందని.. ప్రతీవారం ఓ రైలు పట్టాలెక్కుతోందని స్పష్టం చేశారు. రాబోయే కొన్నేళ్లలో 400 నుంచి 500 వరకు ఈ వందే భారత్ రైళ్లను తయారుచేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.


ఇక పశ్చిమ బెంగాల్‌లో నదీ గర్భంలో నిర్మించిన కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ (మెట్రో లైన్‌-2) ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. హుగ్లీ నదికి తూర్పు తీరంలో మహాకరణ్‌.. పశ్చిమ తీరంలో హావ్‌డా మెట్రోస్టేషన్‌లను నిర్మించారు. ఈ రెండింటిని కలుపుతూ నదీ మట్టానికి 32 మీటర్ల లోతులో.. 520 మీటర్ల పొడవునా ఈ మెట్రో మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం ప్రారంభంతో కోల్‌కతాలోని టెగోరియా స్టేషన్‌ నుంచి హుగ్లీ నదికి అవతలి హావ్‌డా మైదాన్‌ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. భూమి ఉపరితలానికి 33 మీటర్ల దిగువనున్న హావ్‌డా మెట్రో స్టేషన్‌.. దేశంలోనే అతిలోతైన భూగర్భ మెట్రో స్టేషన్‌గా గుర్తింపు పొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com