కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్న తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో ఉంటారని స్పష్టం చేసింది. ఇక తొలి జాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 34 మంది కేంద్రమంత్రులకు మరోసారి అవకాశం కల్పించింది. బీజేపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్‌లో 28 మంది మహిళలకు స్థానం ఇచ్చారు. యువతకు 47 సీట్లు, ఎస్సీలకు 27 స్థానాలు, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలకు 57 నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు.
పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, కేరళ నుంచి 12 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించారు. గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి కేంద్రమంత్రి అమిత్ షా మరోసారి బరిలోకి దిగనున్నారు. యూపీలోని లక్నో నుంచి మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని గుణ స్ధానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉండనున్నారు. దిబ్రూఘడ్ నుంచి శర్భానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, రాజ్‌కోట్ నుంచి పురుషోత్తమ్ రూపాలా, ఉదంపూర్ నుంచి జితేంద్ర సింగ్, గొడ్డా నుంచి నిషికాంత్ దూబే, కుంటి నుంచి అర్జున్ ముండా, త్రిస్సూర్ నుంచి సినీ నటుడు సురేష్ గోపి, పథనం తిట్ట అనిల్ ఆంటోనీలకు అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను విదిశ నుంచి లోక్‌సభ బరిలో నిలిపారు. కేంద్రమంత్రులు వీ మురళీధరణ్ అట్టింగల్ నుంచి.. రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి బరిలోకి దిగనున్నారు.
ఢిల్లీలోని ఉత్తర ఢిల్లీ మనోజ్ తివారీ, న్యూఢిల్లీ నియోజక వర్గంలో సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, వెస్ట్ ఢిల్లీ కమాల్‌జీత్ సెహ్రావత్, సౌత్ ఢిల్లీ రమ్‌వీర్ సింగ్ బిధురి, ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖందేల్వాల్‌లకు అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ స్థానాన్ని అలోక్ శర్మకు ఇచ్చారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వివాదాస్పద బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు బీజేపీ హై కమాండ్ మొండి చేయి చూపించింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి బరిలోకి దిగనున్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్ నుంచి 27, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుంచి 15, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుంచి 12, ఛత్తీస్‌గడ్ నుంచి 12, జార్ఖండ్ నుంచి 11, తెలంగాణ నుంచి 9, ఢిల్లీ నుంచి 5, జమ్మూ కాశ్మీర్ నుంచి 2, ఉత్తరాఖండ్ నుంచి 3, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2, గోవా నుంచి ఒకరు, త్రిపుర నుంచి ఒకరు, అండమాన్ నికోబార్ నుంచి ఒకరు, దమన్ అండ్ దీవ్ నుంచి ఒకరు అభ్యర్థులను పోటీలో నిలిపింది.