డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందనీ, పరిచయం లేని మహిళను అలా పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. జనక్ రామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 354A(1) (iv) ప్రకారం డార్లింగ్ అని పిలవడం అభ్యంతరకరమని జస్టిస్ జై సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
అసలు సంగతిలోకి వస్తే.. 2015 అక్టోబర్ 21న అండమాన్ లోని మాయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జనక్ రామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్‌ను ఉద్దేశించి డార్లింగ్ అని పిలిచాడు. డార్లింగ్ చలానాలు ఇవ్వడానికి వచ్చావా అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మండిపడిన లేడీ కానిస్టేబుల్.. అతని మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కోర్డు.. ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్‌ను పట్టుకుని తాగిన మత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అనంతరం జనక్ రామ్‌కు మూడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో కోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ జనక్ రామ్ పై కోర్టును ఆశ్రయించారు.2023 ఏప్రిల్‌లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, 2023 నవంబర్‌లో అదనపు జిల్లా జడ్జి కూడా జనక్ రామ్‌ను దోషిగా తేల్చారు. దీంతో జనక్ రామ్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. జనక్ రామ్‌పై దిగువకోర్టులు ఇచ్చిన తీర్పుతో కలకత్తా హైకోర్టు ఏకీభవించింది. అయితే మూడు నెలల జైలుశిక్షను, నెలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డార్లింగ్ అని పిలవడం తప్పే అయినా జైలుశిక్ష విధించడం చాలా కఠినమనీ, హెచ్చరించి వదిలేస్తే సరిపోయేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్‌ను అలా అమర్యాదగా పిలవడం తప్పేనని.. కానీ వార్నింగ్ ఇస్తే సరిపోయేదని అభిప్రాయడుతున్నారు. అయితే జనక్ రామ్ ఆ పరిస్థితుల్లో ఆ పదాన్ని వాడటం తప్పని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్‌ను తాగిన మత్తులో డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని అంటున్నారు.