ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైఎస్ఆర్‌సీపీ నుంచి నేతల వలసలు ఎక్కవ అవుతున్నాయి. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మరో ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పారు. గురువారం (మార్చి7) పార్టీని వీడి, మరో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీ గుడ్ బై చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. ఇదే క్రమంలో వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఇటీవలే శ్రీనివాసులు కలిశారు. దీంతో క్రమశిక్షణా చర్యల కింద వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆరణి శ్రీనివాసులు.. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. గురువారం జనసేనలో చేరనున్నట్లు తెలిపారు. అలాగే బలిజ కులానికి చెందిన తనకు వైసీపీలో అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు. వైసీపీలో కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు.చిత్తూరుని అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ తనకు అవకాశం లేకుండా చేశారని శ్రీనివాసులు ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలు సమస్యలు పరిష్కరించలేకపోయానని అన్నారు.
చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి వైఎస్ఆర్‌సీపీ పట్ల నిబద్ధతతో పనిచేశానన్న ఆయన.. 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. తర్వాత రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పి అప్పుడూ మొండిచేయి చూపించారని విమర్శించారు. చిత్తూరులో కాపు భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదన్న ఆయన.. రోడ్లకు సైతం డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. చివరకు సొంత నిర్మాణ సంస్థ ద్వారా పనులు చేయిస్తే బిల్లులు కూడా ఆపేశారని మండిపడ్డారు.ఏపీఐఐసీ ఛైర్మన్ పోస్టు ఇస్తామని చెప్పి అప్పుడు కూడా మోసం చేశారని ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు.
మరోవైపు గురువారం జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనున్నారు. అయితే ఆరణి శ్రీనివాసులను తిరుపతి నుంచి జనసేన తరఫున పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో బలిజ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆరణిని తిరుపతిలో పోటీ చేయిస్తారనే వార్తలు వస్తున్నాయి. అలాగే తిరుపతిలో జనసేనకు బలమైన నేత లేకపోవటం కూడా కారణంగా తెలుస్తోంది.