హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీని నిత్యం ఎంతోమంది దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు కాశీకి వెళ్తుంటారు. అయితే అలాంటి వారికి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. కాశీకి వెళ్లే తెలుగువారి కోసం మరో వసతి గృహం అందుబాటులోకి రానుంది. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం ఆధ్వర్యంలో వారణాసిలో తెలుగు భక్తుల కోసం మరో వసతి గృహం అందుబాటులోకి రానుంది. గత కొన్నేళ్లుగా కాశీకి వెళ్లే తెలుగు భక్తులకు ఈ ఆశ్రమం నిర్వాహకులు ఉచిత భోజనం, తక్కువ ధరలోనే వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. తాజాగా మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి రోజున ఈ వసతి గృహాన్ని ప్రారంభించనున్నారు.
శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వెంకట సుందరశాస్త్రి నేతృత్వంలో ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తు్న్నారు. ఇది శివరాత్రి రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఉండేలా ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న కైలాసం భవనం సమీపంలోనే గదులు ఏర్పాటు చేశారు. ఇది అందుబాటులోకి వస్తే అదనంగా మరో వందమందికి వసతి సౌకర్యం కల్పించవచ్చని ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. కాశీ విశ్వేశ్వరుడి దయతో యాత్రికుల సౌకర్యం కోసం మరిన్ని నిర్మాణాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు వారణాసికి వచ్చే తెలుగు యాత్రికులకు శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం ఎన్నో ఏళ్ల నుంచి సేవలు అందిస్తోంది. తక్కువ ధరలోనే వసతి సౌకర్యంతో పాటు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. నాన్ ఏసీ రూమ్‌లతో పాటుగా ఏసీ రూమ్‌లు సైతం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాజాగా తెలుగు యాత్రికుల కోసం మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది.