వైసీపీ రాజ్యసభ ఎంపీ, నెల్లూరు లోక్‌సభ వైసీపీ ఇంఛార్జి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ తరుఫున అభ్యర్థుల ప్రకటన పూర్తైందని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతోనే నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగుతున్నానన్న విజయసాయిరెడ్డి.. పుట్టినగడ్డకు సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయం వేరు, స్నేహం వేరని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల వరకూ వైసీపీలో కొనసాగారు. అయితే నెల్లూరు జిల్లా అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధిష్టానం తనను పట్టించుకోలేదని ఆయన మనస్తాపానికి గురయ్యారు. దీంతో భార్యతో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ టికెట్‌ను ఆయనకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగితే.. వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఆయనను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఆయన తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ.. రాజకీయం వేరంటూ ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ పోటీపడితే ఇద్దరు మిత్రుల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది.
మరోవైపు మంగళవారమే టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం మీద కూడా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో టికెట్ రాదనే కారణంతోనే ఆయన పార్టీమారారని చెప్పారు. అయితే రాజీనామా చేసిన తర్వాత టీడీపీ కండువా కప్పుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడినవని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలో మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.
మరోవైపు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన విజయసాయిరెడ్డికి వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కావలి మండలం రుద్రకోట వద్ద కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు విజయసాయిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సుమారు 470 కార్లతో భారీ ర్యాలీగా నెల్లూరు వెళ్లారు. దారిలో ఉలవపల్ల వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న హనుమాన్ ఆలయంలో విజయసాయిరెడ్డి పూజలు చేశారు. ఇక నెల్లూరు నగరంలో విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయసాయిరెడ్డిని గుర్రపు బగ్గీపై ఊరేగించారు.