ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. మార్చి 6న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఎగువ చెర్లోపల్లిలో వెలింగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రజలకు ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
మార్కాపురం సమీపంలోని వెలుగొండ అనే కొండ గుహలో వెలిసిన ‘వేంకటేశ్వర స్వామి’ని వెలుగొండస్వామి అని అంటారు. మార్కాపురం, యర్రగొండపాలెం నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ‘పూల సుబ్బయ్య’ ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడం కోసం పోరాటం చేశారు. ఆయన పేరు మీదనే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
మూడు ప్రాంతాల చిరకాల వాంఛ..
వెలిగొండ ప్రాజెక్ట్ అనేది పశ్చిమ ప్రకాశం, ఉదయగిరి, బద్వేల్ ప్రాంతాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నం. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఎగువన కొల్లం వాగు కృష్ణా నదిలో కలిసే చోట.. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల స్థాయిలో నీరు ఉన్నప్పుడు.. కృష్ణా జలాలను ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు తరలించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
ప్రాజెక్ట్ ఇలా..
ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నది వరద జలాలను ముందుగా 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారిస్తారు. అక్కడి నుంచి 18.8 కి.మీ. పొడవున రెండు భారీ సొరంగాలను తవ్వారు. ఆసియాలోనే అతిపెద్ద సాగునీటి సొరంగాలుగా ఇవి పేరొందాయి. దోర్నాల-కర్నూలు మార్గంలోని కొత్తూరు వరకు తవ్విన ఈ రెండు టన్నెళ్ల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించొచ్చు. కొత్తూరు నుంచి సుమారు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘నల్లమల సాగర్’కు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ జలాశయం నుంచి ఐదు ప్రధాన కాల్వల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందిస్తారు.
నల్లమల సాగర్ రిజర్వాయర్..
ప్రకాశం జిల్లాలోని నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా, వెలుపల ఉన్న కొండలను వెలుగొండలు అని పిలుస్తారు. ఈ వెలుగొండ కొండల శ్రేణిలోని సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కొండల మధ్య ఖాళీలను కలుపుతూ.. గోడల తరహాలో ఆనకట్టలు కట్టడంతో 53.85 టీఎంసీల సామర్థ్యంతో సహజమైన నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను ఏర్పాటైంది. ఈ రిజర్వాయర్‌లో 10.35 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కాగా.. 38.57 టీఎంసీలను పంటల సాగుకు, 1.57 టీఎంసీలను తాగునీటి కోసం వినియోగిస్తారు. 3.37 టీఎంసీల నీటిని ఆవిరి రూపంలో నష్టపోతామని అంచనా.
ముందుగా శంకుస్థాపన చేసింది చంద్రబాబే..
1996 మార్చి 5న నాటి సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం సమీపంలోని గొట్టి పడియ వద్ద వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, రైతు ఉద్యమ నాయకులైన కొరటాల సత్యనారయణను చంద్రబాబు తనతోపాటు హెలికాప్టర్‌లో శంకుస్థాపనకు తీసుకొచ్చారు. రూ.980 కోట్ల అంచనాతో.. ఐదేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2000 మే వరకు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులే రాలేదు.
వైఎస్ మరోసారి..
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2004 అక్టోబర్ 27న గొట్టిపడియ దగ్గర వైఎస్ మరోసారి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1996లో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.980 కోట్లు కాగా.. 2005 నాటికి అది రూ.5500 కోట్లకు చేరింది. 2024 నాటికి ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.10 వేల కోట్లు దాటింది. వైఎస్ హయాంలోనే మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి కాగా.. 2011 నాటికి కాల్వల తవ్వకం 80 శాతం పూర్తయ్యింది. కానీ టన్నెల్స్ తవ్వకం పనులు మాత్రం మందకొడిగా సాగాయి.
2021లో తొలి టన్నెల్ పూర్తి..
2004లోనే టన్నెల్-1 నిర్మాణానికి అడుగులు పడ్డాయి. టన్నెల్ తవ్వకం కోసం జర్మనీ నుంచి టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లను తెప్పించారు. అయితే కొద్ది దూరం తవ్వగానే అది మట్టిలో కూరుకుపోయింది. దీంతో 2007 నాటికి తడి నేలను తవ్వగలిగే మెషీన్లను రప్పించారు. 2021 నాటికి టన్నెల్-1 తవ్వకం పనులు పూర్తయ్యాయి. టన్నెల్-1ను టీబీఎం ద్వారా తవ్వగా.. ఒక కి.మీ దూరాన్ని మాత్రం మాన్యువల్‌గా తవ్వారు.
2024 మార్చి5 నాటికి రెండో టన్నెల్ పూర్తి..
2009లో టన్నెల్-2 తవ్వకం పనులు మొదలుపెట్టారు. టన్నెల్-2ను 12 కి.మీ. టీబీఎం ద్వారా తవ్వగా.. సుమారు 7 కి.మీ. దూరం మాన్యువల్‌గా తవ్వారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా.. ఈ టన్నెల్స్ నిర్మాణం జరిపారు.
టన్నెల్-1ను 7.2 మీటర్ల వ్యాసార్థంతో 18.20 కి.మీ. పొడవున తవ్వారు. 2016 మే నాటికి టన్నెల్-1 తవ్వకం 13 కి.మీ. పూర్తి కావాల్సి ఉండగా.. కేవలం 980 మీటర్లు మాత్రమే పనులు జరిగాయి.
ఇక టన్నెల్-2ను 9.20 మీటర్ల వ్యాసార్థంతో 18.83 కి.మీ. పొడవున తవ్వారు. 2016 జూన్ నాటికి 9.78 కి.మీ. తవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కిలోమీటర్‌కుపైగా మాత్రమే తవ్వకం సాధ్యమైంది.
టన్నెల్ తవ్వకాల్లో ఆటంకాలు..
టన్నెల్-1 తవ్వుతున్నప్పుడు మట్టిలో టీబీఎం మెషీన్ కట్టర్ కూరుకుపోవడంతో.. కొండ పై నుంచి తవ్వుకుంటూ వెళ్లి మెషీన్‌ను బయటకు తీశారు. ఈ క్రమంలో 6 నెలల సమయం వృథా అయ్యింది. సొరంగాల నుంచి మట్టిని బయటకు తెచ్చే కన్వేయర్ బెల్టులు పదే పదే తెగిపోవడంతో పనులు ముందుకు కదల్లేదు. రెండు సొరంగాల్లో మట్టి తగిలిన భాగం, రాళ్లు కూలుతున్న సాఫ్ట్ జోనింగ్ ప్రాంతాల్లో రాక్ బోల్టింగ్, షార్ట్ కటింగ్ చేశారు.
వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన సొరంగం పనులు పూర్తి కాగా.. త్వరలోనే ఆర్ అండ్ ఆర్‌ను కూడా పూర్తి చేసి.. వచ్చే వర్షాకాలం సీజన్లో నల్లమలసాగర్‌ను నీటితో నింపుతామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.5974 కోట్లు ఖర్చు చేయగా.. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మరో రూ.4036 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.