ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఊహించని ట్విస్టులు తిరుగుతున్నాయి. తెల్లారేదాకా ఒకరకంగా ఉన్న రాజకీయం .. సాయంత్రానికి మరోలా మారుతోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయమైతే చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పోటీ ఇక్కడ, పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడమే కానీ.. జనసేనాని నోటి నుంచి పోటీ విషయమై క్లారిటీ రావడం లేదు. కాకినాడ, గాజువాక, భీమవరం ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. చివరకు పవన్ కళ్యాణ్ భీమవరం ఫిక్సయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ కూడా పవన్ పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు ఇక్కడ జనసేన తరుఫున పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.పులపర్తి రామాంజినేయులు కూడా జనసేనలో చేరనున్నట్లు ప్రకటించడంతో.. భీమవరంలో జనసేనాని పోటీలేదనే విషయంలో జనసైనికులు ఓ క్లారిటీకి వస్తున్నారు. ఇదే క్రమంలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఎంపీగా లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానంతో పాటుగా ఎంపీగానూ పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంపీగా పోటీ చేసి గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది.
అయితే ఈ విషయమై జనసేన వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకేసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేస్తే భిన్నమైన సంకేతాలు వెళ్తాయని జనసేన నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట . ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల మాదిరిగా రెండూ అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తారా, లేదా ఒక అసెంబ్లీ, మరోచోట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇవన్నీ ఎందుకని ఎంపీగా, లేదా ఎమ్మెల్యేగా ఏదో ఒక్క చోట మాత్రమే పోటీకి పరిమితం అవుతారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.