టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.. మరో రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించింది. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి గోరంట్ల రవికుమార్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జ్‌లుగా నియించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కురుపాం నియోజకవర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు, శింగనమలకు చెందిన కె.రామలింగారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పిల్లి సత్యనారాయణమూర్తి, సహ సమన్వయకర్తగా కటకంశెట్టి ప్రభాకర్‌లను నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు.
వాస్తవానికి ప్రకాశం జిల్లా దర్శి టికెట్ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఎన్నారై గరికపాటి వెంకట్‌కు టికెట్ ఖాయమని చర్చ నడిచింది.. ఆయన కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ప్రకాశం జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థల యజమాని గోరంట్ల రవికుమార్‌ను దర్శి టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించడం ఆసక్తికరంగా మారింది. మరి దర్శి టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ మొదలైంది.. తాజా పరిణామాలను చూస్తే టీడీపీకి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం కూడా జనసేనకు కేటాయిస్తారని చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడ కూడా టీడీపీ ఇంఛార్జ్‌ను మార్చేసింది. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని రైల్వేకోడూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌ను మార్చారు. ఇప్పటి వరకు ఇంఛార్జ్‌గా వ్యవహరించిన కస్తూరి విశ్వనాథనాయుడి స్థానంలో ముక్కా రూపానందరెడ్డిని నియమించింది. విశ్వనాధనాయుడితో ముందస్తుగానే పార్టీ అధిష్ఠానం సంప్రదించి మార్పు చేసింది. పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామనే హామీనిచ్చింది. ఆ తర్వాతే ఓబులవారిపల్లె మండలానికి చెందిన రూపానందరెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల జారీ చేశారు. రూపానందరెడ్డి ఇటీవల నారా చంద్రబాబునాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు.
అనంతరం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రధాన నాయకులందరిని కలిసి పార్టీ విజయానికి పనిచేద్దామనే చర్చలు జరిపారు. ఈయన స్వతహాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణానంతరం సీఎం జగన్ గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉండగా ఆయనకు మద్దతుగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల తీరు నచ్చక టీడీపీలో చేరారు. మొత్తానికి ఈ రెండు సీట్లు జనసేనకు వెళతాయని భావించగా.. తాజాగా టీడీపీ ఇంఛార్జ్‌లను నియమించడం ఆసక్తికరంగా మారింది.