ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికలు సమయం సమీపిస్తుండటంతో పార్టీలలోకి చేరికలు, వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. వైఎస్ఆర్‌సీపీలోకి చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆదివారం వెల్లడించారు. తన కుమారుడు గిరితో కలిసి వైసీపీలో చేరనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. మార్చి 14వ తేదీ వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అయితే వైసీపీలో చేరే విషయమై తాను ఎలాంటి కండీషన్లు పెట్టలేదని ముద్రగడ పద్మనాభం తెలిపారు. అలాగే పార్టీ ఏ పదవి ఇచ్చినా తన వంతు న్యాయం చేస్తానని అన్నారు. మార్చి 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిసింది.
ముద్రగడ పద్మనాభం గతంలో కాకినాడ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. వైసీపీలో చేరతారంటూ అప్పట్లోనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన దానిని తోసిపుచ్చారు. వైసీపీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత జనసేన, టీడీపీ నేతలు ఆయనతో భేటీ కావటంతో జనసేనలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఓ దశలో ముద్రగడ పద్మనాభం కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని ఆయన ఇంటికి వెళ్లి కలుస్తారని, ఆ తర్వాత ఆయన అధికారికంగా పార్టీలో చేరతారనే కథనాలు వచ్చాయి. కానీ ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు.
దీంతో ముద్రగడ పద్మనాభం అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే వైసీపీ నేతలు ముద్రగడతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడను తన పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ భావించింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి.. ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే పోటీ చేస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే వైసీపీలో చేరబోనని గతంలో అభిప్రాయపడిన ముద్రగడ పద్మనాభం.. మళ్లీ అదే పార్టీలోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
అయితే పవన్ కళ్యాణ్ అవమానించటంతోనే ముద్రగడ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. ఇంటి వస్తానని రెండుసార్లు కబురంపి అవమానించారని మండిపడుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి విమర్శలేనంటున్నా్రు జనసైనికులు. ముద్రగడ వైసీపీకి ఎప్పటి నుంచో కోవర్టుగా పనిచేస్తున్నారని, టీడీపీ, జనసేన పొత్తు కుదరకుండా చూడాలని ప్రయత్నించారని మండిపడుతున్నారు. అలా వీలుకాకపోవటంతోనే ఇప్పుడు వైసీపీ గూటికి చేరుతున్నారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా కాకినాడ రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.