2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడం ఖాయమైంది. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. బీజేపీ ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని.. జనసేన 24 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో.. ఏపీలో మరోసారి 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతోందని చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా.. జనసేన పోటీ చేయలేదు కానీ.. ఎన్డీయే కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడంతోపాటు ప్రచారం సైతం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీ స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
2014లో ఏపీలో ప్రత్యేక పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, విభజన హామీలు నెరవేరడానికి కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో సఖ్యత ఉండాలని.. టీడీపీ ప్రచారం చేసింది. మరోవైపు జగన్ ఒంటరిగానైనా బలంగా పోరాడారు.
ఇక 2024 విషయానికి వస్తే.. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ 2014 నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని.. అప్పుల భారం పెంచారని.. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడికి మళ్లీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ, జనసేన చెబుతున్నాయి. 2019 ఎన్నికల ముందు ఎన్డీయే నుంచి బయటకొచ్చి.. ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్న చంద్రబాబు నాయుడు.. ఈ ఐదేళ్లలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. గత ఏడాది ఆయన జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది.
2014తో పోలిస్తే.. ఏపీలో ఇప్పుడు రెండు తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుండటం కాగా.. రెండోది అప్పుడు దాదాపు తుచిపెట్టుకుపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు షర్మిల నాయకత్వంలో పోటీలోకి దూసుకొస్తోంది.
2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా.. టీడీపీకి బేషరతుగా మద్దతు ప్రకటించింది. కానీ ఇప్పుడు పవన్ పార్టీ సైతం బరిలోకి నిలుస్తోంది. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలే కేటాయించడం, బీజేపీ కోసం లోక్ సభ స్థానాలను పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి రావడం.. జనసేన శ్రేణులకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుకు కష్ట సమయంలో అండగా నిలిస్తే కేటాయించేది 24 స్థానాలేనా..? కనీసం 40 స్థానాలైనా కేటాయించరా..? అనే ప్రశ్నను జనసేన శ్రేణులు, కాపు నాయకులు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఓట్లు టీడీపీకి ఎంత వరకు బదిలీ అవుతాయనే ప్రశ్న తలెత్తుతోంది.
2014 ఎన్నికల్లో జగన్ సమరోత్సాహంలో కనిపించారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి.. 2014 ఎన్నికల ముందు బెయిల్ మీద విడుదలైన జగన్‌కు అప్పట్లో సానుభూతి కలిసొచ్చింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీని నడిపించిన షర్మిల, విజయమ్మ ఇప్పుడు ఆయన వెంట లేరు. ఇటీవల షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టడంతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త శక్తి వచ్చినట్లయ్యింది. షర్మిల ఇప్పటికే జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల ఎంట్రీ జగన్‌కు ప్రతికూలం అవుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జగన్‌కు అండగా ఉంటోన్న వర్గాలు కొంత మేరకైనా షర్మిలవైపు చూస్తే.. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులే జగన్‌ను నమ్మడం లేదని, ప్రజలు ఎలా నమ్ముతారని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది.
స్థూలంగా చెప్పాలంటే 2014 నాటి పరిస్థితులే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయి. అయితే ఓటు బదిలీ అనేది కూటమికి కీలకం కాగా.. షర్మిల రూపంలో జగన్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. మరి ఈ పరిస్థితుల్లో సిద్ధం అంటున్న వైఎస్సార్సీపీ, యుద్ధం అంటోన్న కూటమి మధ్య పోరులో గెలిచేది ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.