మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉందని, తమ ప్రతి అవసరాలకు భార్యలను డబ్బులు అడగాల్సి రావడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అసంతృప్తితో అందుకే వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెబుతారని అన్నారు. కానీ, వారి మాటలను వినకుండా వైఎస్‌ఆర్సీపీకి ఓటేసి, గెలిపించాలని మహిళలను కోరారు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం నిర్వహించిన వైఎస్‌ఆర్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో మంత్రి మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.
‘2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మీరు అధికారం ఇచ్చారు.. మీరు ఓట్లేసి అధికారం ఇచ్చి ఐదేళ్లు అవుతోంది... మహిళల సంక్షేమానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం.. అందుకే పురుషులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అక్కసు.. మా ప్రభుత్వ పథకాల పంపిణీ సమయంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాల్లో మిమ్మల్ని కలిశాను.. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అధికారిక సమావేశం.. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.. తరువాత అధికారులతో ఏర్పాటు చేసే సమావేశాలు ఉండవు.’. అని మంత్రి వ్యాఖ్యానించారు.
అయితే, మంత్రి ధర్మాన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. మాపై కడప రెడ్ల పెత్తనం ఏంటంటూ ఇటీవల ఆయన చేసిన సంచలనలు వ్యాఖ్యలు అధికార వైఎస్ఆర్సీపీలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘‘కడప నుంచి ఎవడో వచ్చాడు.. సుబ్బారెడ్డి అంట, భూములు లాగేస్తామంటున్నాడు... అసలు నిన్ను ఇక్కడకి ఎవడు రమ్మని అన్నాడు.. శ్రీకాకుళం ఏమైనా నీ అబ్బగారి సొమ్ము అనుకున్నావా’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన ఆరోపణలు చేశారు.