ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు ఖరారు కావటంతో ఏపీ బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ఇప్పటి వరకూ పొత్తులు ఉంటాయా, లేదా ఒంటరి పోరా అనే సందేహంలో కొట్టుమిట్టాడిన ఏపీ బీజేపీ నేతలు.. ఇక విజయమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఓ వైపు కూటమిలోని ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూనే తమదైన గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి మ్యానిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
మ్యానిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రచార రథాల్లో ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను బాక్స్‌లో ఉంచుతామని పురంధేశ్వరి తెలిపారు. "ప్రచార రథాలలో రెండు బాక్సులు ఉంటాయి. ఒక బాక్సులో కేంద్రంనుంచి మీరేమీ ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తాం. మరో బాక్సులో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తాం. కోటిమంది నుంచి అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మ్యానిఫెస్టోలో చేరుస్తాం" అని పురంధేశ్వరి వివరించారు.
జాతీయస్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్రస్థాయి కి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్న పురంధేశ్వరి.. ఏపీవ్యాప్తంగా 45వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపైనా పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు ఖరారైందనీ, ఎన్నిసీట్లు, ఎక్కడనుంచి పోటీ అనేది రెండు రోజుల్లో తేలిపోతుందని చెప్పారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసమే పొత్తులన్న పురంధేశ్వరి.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అంతటి రాముడే ఉడత సాయం తీసుకున్నారన్న పురంధేశ్వరి.. రాముడు అంతటి వాడు సహకారం తీసుకోగా, బీజేపీ తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.