రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్. కడప విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు రూ.265 కోట్ల వ్యయంతో నూతన టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు ఈ టెర్మినల్ నిర్మాణ పనులకు గానూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే టెండర్లు పిలిచింది.ఇందులో భాగంగా రూ.265 కోట్ల వ్యయంతో న్యూ డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణంతోపాటుగా.. మూడు ఏరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు.
16 వేల 455 చదరపు మీటర్లలో టెర్మినల్ నిర్మాణం జరగనుంది. అలాగే మూడు ఏరో బ్రిడ్జులను సైతం కడప ఎయిర్‌పోర్టులో నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పూర్తైతే టెర్మినల్ నుంచే నేరుగా విమానంలోకి చేరుకునే వీలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు మరోవైపు నూతన డొమెస్టిక్ టెర్మినల్ భవన నిర్మాణం పూర్తైతే.. కడప ఎయిర్ పోర్టు నుంచి 700 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తైతే.. పెద్ద విమానాలను ఇక్కడి నుంచి నడిపేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం కడప ఎయిర్ పోర్టు నుంచి 70 మంది సామర్థ్యం ఉన్న విమానాలు మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి.
కడప ఎయిర్‌పోర్టులో పెద్ద విమానాలు నడిపేందుకు అనుకూలంగా రన్‌వేను ఇప్పటికే అభివృద్ధి చేశారు. అలాగే రాత్రివేళ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా నైట్ ల్యాండింగ్ కోసం అనుమతులు కూడా వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. రన్‌వేను పెంచడంతో పాటుగా రన్‌వే లైటింగ్, అప్రోచ్ లైటింగ్, పార్కింగ్ బే లైటింగ్, సెక్యూరిటీ వంటి సౌకర్యాలన్నీ కూడా విమానాశ్రయంలో పూర్తైనట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.