ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విషయంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షల (టీఆర్‌టీ-డీఎస్సీ)ను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు టెట్, డీఎస్సీకి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూలను మార్చినట్టు తెలిపారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా ఎస్జీటీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు. సాధారణంగా ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.
టెట్, డీఎస్సీల మధ్య గడువు విషయంలో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టెట్ ముగిసిన మర్నాడే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రిపరేషన్‌కు సమయం లేదని, షెడ్యూల్ మార్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని మార్చి 4న తీర్పు ఇచ్చింది. దీంతో విద్యాశాఖ షెడ్యూల్‌లో మార్పులు చేసింది.