భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ శనివారం నాడు చర్చలు జరిపారు. 50 నిమిషాల పాటు జరిపిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని ముగ్గురు నేతలు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ డెమోక్రటిడ్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమిలో చేరాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ను అమిత్ షా ఆహ్వానించారు. అందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని తెలుస్తోంది. త్వరలో జరిగే ఎన్డీఏ భేటీకి తెలుగుదేశం పార్టీ హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలపై బీజేపీ దృష్టిసారించింది. ఎక్కువ సీట్లు అడగడంతో చర్చలు సుధీర్ఘంగా కొనసాగాయి. బీజేపీ, జనసేనకు 30 సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. 145 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ, జనసేనలకు ఇచ్చేందుకు టీడీపీ ప్రాథమికంగా అంగీకరించింది. 8 సీట్లలో బీజేపీ ఆరు చోట్ల బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ గురించి బీజేపీ అంతగా పట్టించుకోవడం లేదు. లోక్ సభ సీట్లపై మాత్రం దృష్టిసారించింది. ఎంపీ టికెట్లు ఎక్కువ కావాలని అమిత్ షా కోరారని వార్తలు వచ్చాయి.