విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) శుభవార్త చెప్పింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే హాస్టల్ వసతి కల్పిస్తామని ప్రకటించింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు సిఫార్సులు లేకుండానే హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైతే కొత్త హాస్టళ్లను నిర్మించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అలాగే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరువాభరణాలకు బంగారు పూత పూయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలన అనుమతికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
మరోవైపు టీటీడీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థుల హాస్టల్ వసతి కోసం టీటీడీ అనేక చర్యలు చేపడుతోంది. ఇటీవలే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ బ్లాక్‌ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14 కోట్లతో నిర్మించిన హరిణి హాస్టల్ బ్లాక్ భవనాన్ని టీటీడీ ఛైర్మన్ ప్రారంభించారు. ఇందులోని 112 గదుల్లో 672 మంది విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించేలా నిర్మించారు. స్డడీ రూమ్‌లు, రిక్రియేషన్ హాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఈ భవనాన్ని నిర్మించింది.
అయితే టీటీడీ ఆధ్వర్యంలోని కాలేజీల్లో ప్రవేశం పొందిన తర్వాత కూడా హాస్టల్ వసతి కోసం సిఫార్సు చేసే పరిస్థితి ఇన్నిరోజులూ ఉండేది. అయితే ఇలాంటి పరిస్థితి ఇక ఉండదని టీటీడీ చెబుతోంది. సిఫార్సులతో సంబంధం లేకుండా కాలేజీల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించింది. అవసరమైతే కొత్త భవనాలు నిర్మించేందుకు సైతం టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.