నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. కొద్దిరోజులుగా ఇదే చర్చ జరుగుతోంది.. ఈ క్రమంలో తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖాయమైంది. దీంతో రఘురామ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ మరోసారి తెరపైకి రాగా.. ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
రఘురామ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.. ఆ పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకున్నారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయమే తేలలేదు. తెలుగుదేశం–జనసేన కూటమితో బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత స్పష్టత వస్తుందని రఘురామరాజు ప్రకటించారు.
తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం – జన సేన పార్టీలు ఉమ్మడి జెండా సభ వేదికపై నుంచే తన మనసులో మాట చెప్పారు. బీజేపీ తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తారని అంతా భావించారు. నరసాపురం లోక్‌సభ స్థానంపై రెండు మూడు రోజులు సస్పెన్స్ కనిపించింది.. ఆ సీటు బీజేపీకి ఇస్తారనే టాక్ వినిపించింది. టీడీపీ–జనసేన–బీజేపీల మధ్య పొత్తు కుదర డంతో లోక్‌సభ స్థానాల సర్దుబాటుపై కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. బీజేపీ కూటమి తరపున ఆరు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ అంగీకరించారని టాక్ వినిపించింది.
నరసాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు కేటాయిస్తేనే దానిని బీజేపీకి ఇస్తామంటూ చంద్రబాబు ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే విషయానికి జనసేన అధినేత కట్టుబడ్డారు. ఇద్దరు నేతల ఏకాభిప్రాయన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గర ఉంచారు. లేదంటే వేరే స్థానాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారట.. అయితే ఏలూరు స్థానంపై బీజేపీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘురామ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది అంటున్నారు.
రఘురా టీడీపీలోకి వెళ్లడం ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. పొత్తులో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం జనసేనకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎంపీ రఘురామ బీజేపీ తరపున పోటీ చేస్తే మూడు నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు లేకుండా పోతుంది. ఇప్పుడు టీడీపీ తరపున ఎంపీ రంగంలోకి దిగడంతో ప్రతి నియోజకవర్గంలోనూ సైకిల్ గుర్తు ఉంటుందంటనే కొత్త చర్చ జరుగుతోంది. దీంతో తాజాగా నరసాపురం టీడీపీకే కేటాయిస్తారని క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు.