సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణదీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్‌గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి, రివర్‌ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్నారు.