అగ్రవర్ణాలలోని పేద మహిళలకు ఏటా 15 వేలు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన జగన్.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేన , బీజేపీ కూటమిపై విమర్శలు సంధించారు. 2014లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారనీ.. ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. ఓటుతో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
"2014లో ఇదే ముగ్గురు కూటమిగా వచ్చారు. ఇప్పుడు చెప్తున్నట్లే అప్పుడు కూడా మోసపూరిత హామీలు ఇచ్చారు. అన్ని హామీలు ఇచ్చిన చంద్రబాబు మ్యానిఫెస్టో అమలు చేశారా? మళ్లీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామని చెప్తారు. వచ్చే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు. కానీ మీ బిడ్డకు మోసం చేయడం రాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వచ్చు. మోసపూరిత హామీలతో వచ్చే వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి" అని జగన్ పిలుపునిచ్చారు.
మరోవైపు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కావటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేశారు. గురువారం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేశారు. అయితే సీఎం బటన్ నొక్కినా కూడా.. ఇంకా తమ ఖాతాల్లోకి నగదు జమకాలేదని పలుచోట్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నగదు జమ కావడం లేదని కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బనగానపల్లె సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఎన్నికల కోడ్ మరో మూడు, నాలుగు రోజుల్లో వస్తుంది. బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేశాం. అయితే డబ్బులు జమ కావటానికి కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఓ వారం అటో ఇటో అయితే ఆందోళన వద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంది, మీ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి. దుష్ప్రచారాన్ని నమ్మకండి " అని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్లు మార్చినట్లు భార్యలను మార్చే మ్యారేజీస్టార్ అని సెటైర్లు వేశార. విశ్వసనీయత లేని చంద్రబాబు, విలువలు లేని పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి తన మీదకు యుద్ధానికి వస్తున్నారని జగన్ విమర్శించారు.