దేశంలోని రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు.. ఎన్నికల బాండ్ల ద్వారా అందించిన వివరాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్‌బీఐను ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం వరకు గడువు ఇవ్వగా.. గురువారం రోజే ఈసీకి ఎస్‌బీఐ వివరాలు అందించడంతో ఆ డాటా మొత్తాన్ని రెండు భాగాలుగా ఈసీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే అందులో ఏ పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చారు.. ఏ పార్టీ ఎవరి దగ్గర విరాళాలు తీసుకున్నారు అనే విషయాలు అందులో స్పష్టం చేయలేదని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 18 వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని ఎన్నికల సంఘంట కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అది విన్న కోర్టు.. ఎస్‌బీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల నంబర్లు లేకపోవడంతో విరాళాలు ఎవరు ఎవరికి ఇచ్చారు అనేది స్పష్టంగా తెలియడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని వివరాలను వెల్లడించాలని ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
తాము తీర్పు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదో మార్చి 18 వ తేదీ విచారణలో వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం నాటికి ఎన్నికల కమిషన్‌కు అందించాలని మరోసారి స్పష్టం చేసింది. బాండ్ల నంబర్లతో రాజకీయ పార్టీలకు ఏ దాత ఎంత విరాళం ఇచ్చారనేది తెలియనుంది.
ఎన్నికల బాండ్లపై మార్చి 11 వ తేదీన ఇచ్చిన తీర్పును కొంత సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది. 2019 ఏప్రిల్ 12 వ తేదీకి ముందు జారీ చేసిన బాండ్లు.. వాటిని అందుకున్న పార్టీల వివరాలను ఎన్నికల సంఘం గతంలో ఎస్‌బీఐ రెండు సార్లు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. అయితే ఇటీవల ఏప్రిల్ 19 వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందజేయాలని ఎస్‌బీఐని ఆదేశించిన సుప్రీం.. అంతకంటే ముందు నాటి బాండ్ల వివరాలను కూడా బహిర్గతం చేయాలని సూచించింది.