దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైందని పేర్కొన్నారు. ఇక బీజేపీ, ఎన్డీఏ కూటమి ఎన్నికలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
2024 ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించిందని.. తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు, అందించిన పథకాలు వాటి ఫలాలతోనే ఓట్ల కోసం ఓటర్ల వద్దకు వెళ్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం వరకు మోసానికి గురయ్యామనే భావనలో దేశ ప్రజలు ఉన్నారు. అప్పుడు అన్ని రంగాల్లో కుంభకోణాలు, అవినీతి జరిగిందని.. ఆ సమయంలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూడటానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల నుంచి దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రస్తుతం 140 కోట్ల మంది పౌరుల సహకారంతో అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తోందని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని.. దేశంలోని కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. భవిష్యత్ గురించి ఆలోచించే ప్రభుత్వం ఏం చేయగలదో దేశ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించారు. అందుకే ఈసారి 400 స్థానాలు అని ప్రజలు కూడా చెబుతున్నారని తెలిపారు. దేశంలోని ప్రతిపక్షాలకు ఒక లక్ష్యం గానీ.. విధానం కానీ లేదని విపక్షాలపై మండిపడ్డారు. తమను నిందించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్ప ప్రతిపక్షాలకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు చేసే వారసత్వ, విద్వేష రాజకీయాలు ఏమాత్రం దేశ ప్రజలు ఆమోదించరని ఆరోపించారు. వారి అవినీతి ట్రాక్ రికార్డే వారిని దెబ్బతీసిందని.. దేశప్రజలు అలాంటి నాయకత్వాన్ని కోరుకోవడం లేదని మోదీ తెలిపారు.