రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో జరిగిన అభివృద్ధి, ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాలు, కార్యకర్తల త్యాగాలు నన్ను మళ్లీ గెలిపిస్తాయని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పరిటాల సునీత ఇచ్చిన అనేక హామీలను రాప్తాడు నియోజకవర్గ చరిత్రలో కలిసిపోతే వాటిని నిజాలు చేసి చూపించా అని అన్నారు. శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టి పార్లమెంటు, అసెంబ్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాప్తాడులో మళ్లీ బరిలో నిలుస్తున్నా. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చా. రామగిరి వేలాదిమంది పేద రైతులకు ఉచిత బోర్లు వేశాం. మహిళలకు ఉపాధి కల్పించేందుకు గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకు భూములు కేటాయించాం. 10 వేల మంది మహిళా పాడి రైతుల కోసం అమ్మ డెయిరీ తీసుకొచ్చాం. 17 వేల ఇళ్ల నిర్మాణాలు చేశాం. 20 వేలు ఇంటిపట్టాలు ఇచ్చాం. మరో 10 వేల ఇళ్లకు డిపిఆర్ మంజూరైంది. డిబిటి, నాన్ డిబిటి కింద నియోజకవర్గంలో 3 వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాం. ప్రతి చెరువుకూ నీళ్లిచ్చాం. చరిత్రలో ఎప్పుడూ నీళ్లు చూడని చెరువులకు సైతం నీళ్లు తీసుకొచ్చి మరువలు పారించాం. జగనన్న పాలనలో ఈ ఐదేళ్లూ ప్రతి గడపా చాలా సంతోషంగా గడిపింది. 117 కోట్లతో 110 గ్రామాలకు పిఎబిఆర్ నీళ్లు తీసుకొస్తున్నాం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 48 గ్రామాలకు నీళ్లు తీసుకొస్తున్నాం. రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. టిడిపి ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనుల టెండర్లను దక్కించుకున్న పరిటాల కుటుంబం, బంధువులు ఆ పనులు జరగకుండా అడ్డుకున్నారు. మూడు రిజర్వాయర్లను మంజూరు చేయించుకున్నాం. రామగిరి మండలంలో∙1500 కోట్లతో 300 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చాం. కనగానపల్లి మండలంలో 5 వేల కోట్లతో 1050 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాన్ని తెచ్చుకున్నాం. రామగిరి బంగారు గనులు తెరిపిస్తున్నాం. గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. వీటివల్ల నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి. వేల కుటుంబాలను బతికించడానికి మళ్లీ జగనన్న రావాలి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రావాలి. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.