దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాలపై పడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సిఫారసు లేఖలు రద్దు చేసింది. వాటి ద్వారా దర్శనాలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనం, వసతి కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రొటోకాల్ వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం, వసతి సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏ రకమైన వసతి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు, వీఐపీలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.