షెడ్యూల్ విడుదలయ్యే సమయానికే రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది. టీడీపీ, జనసేన మధ్య అంతకు ముందే పొత్తు కుదరగా... తాజాగా బీజేపీ కూడా వారితో జతకట్టింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. కలిసి ప్రయాణం చేయాలనుకున్న వెంటనే... ఆ పార్టీల మధ్య శరవేగంగా సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. ఎవరెవరు ఎక్కడ పోటీచేయాలనే అంశంపై అంగీకారం కూడా కుదిరింది. ఈ సర్దుబాటుకు అనుగుణంగా టీడీపీ ఇప్పటికే 128 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 16 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అధికార పక్షం వైసీపీ 13 విడతల్లో జాబితాలు ఇస్తూ ఇస్తూ... మార్పులు చేస్తూ... చివరికి శనివారం పూర్తిజాబితా విడుదల చేసింది. ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మాత్రం పెండింగ్‌లో ఉంచింది.