కేంద్రంలో మూడోసారి ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేయాలని... రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని పెకలించాలని ఆంధ్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా సంకల్పం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ‘‘వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పేదల సంక్షేమం, యువతకు ఉపాధి, మహిళలకు కొత్త అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పోర్టులతోపాటు బ్లూ ఎకానమీ విస్తరణ చేయాల్సి ఉంది. అవన్నీ జరగాలంటే ఏపీ అసెంబ్లీ, ఢిల్లీ పార్లమెంటులో ఎన్డీయే సభ్యులు ఉండాలి. అప్పుడే మీరు అభివృద్ధి భారత్, అభివృద్ధి ఆంధ్ర సాకారానికి మద్దతిచ్చినట్లు’’ అని తెలిపారు. రాష్ట్రంలో జగన్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని మోదీ పేర్కొన్నారు. ‘‘ఒకే కుటుంబం రెండు పార్టీలను నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలను కాంగ్రె్‌సవైపు మళ్లించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మీరు పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చవద్దు. ఎన్డీయే కూటమి అభ్యర్థులకే ఓటు వేయండి, వేయించండి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.