జాతీయ రహదారిపై వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ట్రైనీ డీఎస్పీ విష్ణుస్వరూప్ వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై ట్రైనీ డీఎస్పీ విష్ణుస్వరూప్, ఎస్‌ఐలు ఎం.ప్రేమ్‌కుమార్, జ్వాలాసాగర్ కానిస్టేబుళ్లు పి.విజయకుమార్, గోపి, త్రిమూర్తులు, శ్రీనివాస్‌లతో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రావులపాలెం నుంచి తణుకు వైపు వెళ్తున్న ఏపీ 02 ఏడీ 3887 మహేంద్ర జైలో వాహనాన్ని ఆపి చూడగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయి, కారు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఒడిసా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కెందుగూడ గ్రామానికి చెందిన దమా కొంతేరి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంహరాస్ గ్రామానికి చెందిన సతీష్‌విశ్వాస్ 202 కిలోల గంజాయి తరలిస్తున్నట్టు నిర్ధారించారు. గంజాయి విలువ రూ.10 లక్షలు, వాహనం విలువ రూ.2.50 లక్షలుగా పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.